ముత్తగూడెంలో వ్యక్తి దారుణ హత్య
వరుసగా రెండో హత్యతో భయాందోళనలో గ్రామస్థులు
కాకతీయ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ముత్తగూడెం గ్రామంలో మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈసంఘటన శనివారం జరిగింది. గ్రామంలో కుటుంబ నేపథ్య విషయంలో హత్య జరిగిన విషయం మరువకముందే మరో హత్య జరగటం తో ముత్తగూడెం గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముత్తుగూడెం గ్రామానికి చెందిన బూర శ్రీనివాసరావు (45) అనే వ్యక్తిఖమ్మం నగరంలో ఓ స్వీట్ షాప్ లో 15 సంవత్సరాలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల ఆరవ తేదీ సాయంత్రం స్వీట్ షాప్ లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన వరుసకు సోదరుడైన ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైపాస్ రోడ్ లో శ్రీనివాసరావు ను అటకయించి కిడ్నాప్ చేశారు. రాత్రి వరకు శ్రీనివాసరావు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య ఖమ్మం రూరల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఖమ్మం నగరంలోని సాగర్ కాలవలో శ్రీనివాసరావు మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా ముత్తగూడెంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి ఖమ్మం రూరల్ పోలీసులు విచారణ చేపట్టి ఇప్పటికే నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


