వేధింపుల ఎక్సైజ్ సీఐపై చర్యలేవీ?
విచారణ పేరుతో వేచి చూసేలా..ఆచితూచి వ్యవహారం
అర్థం కాని ఉన్నతాధికారుల వైఖరి
ఇష్యూను పక్కదారి పట్టేలా చేస్తున్న కొంతమంది అధికారులు?!

కాకతీయ ,కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కె. అఖిలను, అదే స్టేషన్‌కు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జయశ్రీ వ్యక్తిగతంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వేధింపులు తట్టుకోలేక అఖిల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అఖిల కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తర్వాత, అఖిల కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర సహోద్యోగులు కొత్తగూడెం ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సీఐ జయశ్రీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బాధితురాలికి అండగా నిలబడి, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా అబ్కారీ అధికారిని కోరిన విషయం విదితమే.
గతంలోనూ ఆరోపణలు…!
గతంలో కూడా ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌ను సీఐ జయశ్రీ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎస్ఐ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. సిబ్బంది చేసిన ఫిర్యాదుల మేరకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ విషయంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. విచారణ నిమిత్తం సీఐ జయశ్రీని ఖమ్మంలోని డిప్యూటీ కమిషనర్ ఎదుట హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే విచారణ పేరుతో సాగదీత కొనసాగుతోందన్న విమర్శలు సొంత డిపార్ట్‌మెంట్ నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.
అసలేం జరుగుతోంది..?!
సంఘటనపై విచారణకు ఆదేశించి మూడు రోజులు గడిచినా అధికారుల నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడం గమనార్హం. మహిళా కానిస్టేబుల్‌కు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగాలేరా ..? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. నిత్యం తోటి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ శాఖలో పనిచేస్తున్న కింది సాయి సిబ్బందిపై మండిపడటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారనే ఆరోపణలు జయశ్రీ పై ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు.ఇప్పుడు ఓ మహిళా కానిస్టేబుల్ మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే వరకు వెళ్లడం గమనార్హం. ఇంత జరిగినా ఉన్నతాధికారుల వైఖరి నాన్చివేత ధోరణిలోనే ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా సీఐ వేధింపులకు గురి చేశారని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఎక్సైజ్ శాఖ మహిళా కానిస్టేబుల్ పక్షాన దళిత సంఘాలు ఒకవైపు.. అసత్య ప్రచారాలతో గిరిజన బిడ్డ అయిన సీఐపై కావాలనే కక్షగట్టి యూనియన్లో కొందరు పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. సీఐ పక్షాన కొందరు గిరిజన నేతలు ఆ శాఖ ఉన్నతాధికారులకు పరస్పరంగా ఫిర్యాదు చేయడంతో చర్యలు గైకొనడం వెనుక కొంత జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం అధికారుల నుంచి తెలుస్తోంది.


