విక్రయానికి 7 రోజుల పసికందు
డయల్ 100 సమాచారంతో పోలీస్‌ల మెరుపుదాడి
తల్లీ, మధ్యవర్తులు అరెస్ట్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కేవలం 7 రోజుల వయసున్న పసికందును విక్రయించడానికి యత్నించిన ముఠాను ఒక్క ఫోన్ కాల్ సమాచారంతో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. భర్త వదిలేసాడు పేదరికంతో బిడ్డను పోషించలేనని కన్నతల్లి చెప్పడంతో ఆమెను ఉపయోగించుకుంటూ మధ్యవర్తులు డీల్‌కు సిద్ధమైనట్టు పోలీసులు గుర్తించారు.
ప్రలోభ పెట్టి విక్రయానికి
వైజాగ్‌కు చెందిన 22 ఏళ్ల శీలం సాయి శ్రీ భర్తతో విబేధాలు రావడంతో గర్భిణీ స్థితిలోనే హైదరాబాద్‌కు వచ్చి తన స్నేహితులు అభినవ్, హీనా వద్ద ఆశ్రయం తీసుకుంది. నవంబర్ 14న ఆమె గాంధీ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో సాయిశ్రీ ఆర్థిక పరిస్థితిని దుర్వినియోగం చేసిన అభినవ్, హీనా బిడ్డను పోషించడం కష్టమని అమ్మేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆమెను ప్రలోభపెట్టారు. దీనికి సాయిశ్రీ అంగీకరించడంతో హీనా తనకు తెలిసిన పల్లవి, భవాని అనే మధ్యవర్తుల ద్వారా కరీంనగర్‌లో కొనుగోలుదారులను ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో ఒప్పందం రూ. 5 లక్షలకు ఖరారు కావడంతో నవంబర్ 20న ముఠా సభ్యులు అశోక్ అనే డ్రైవర్‌తో కలిసి కారులో కరీంనగర్ చేరుకున్నారు. భవాని సూచన మేరకు ఆర్య ఆసుపత్రి వద్ద కొనుగోలు దారులకు పసికందును చూపించారు. ఈ ప్రక్రియలో డబ్బుల విషయంలో మాటలు కఠినతరం కావడం సంశయాస్పదంగా వ్యవహరించడం గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఆటో డ్రైవర్ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు కదిలేలోపే భయపడిన ముఠా అక్కడినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తర్వాత కిసాన్ నగర్ ప్రాంతంలో భవాని రూ. 5 లక్షలు తీసుకుంటున్న సమయంలో కరీంనగర్ టూ టౌన్ పోలీసుల ఏస్సై జె. అరుణ్ బృందం దాడి చేసి నిందితులందరినీ పట్టుకుంది. ఈ ఘటనతో 7 రోజుల పసికందును విక్రయం చేసేందుకు చేసిన ప్రయత్నం వెలుగులోకి రావడంతో నగరంలో కలకలం రేగింది. ఈ దాడిలో పసికందును రక్షించిన పోలీసులు నిందితుల వద్ద నుండి విక్రయానికి తీసుకున్న నగదు రూ.5 లక్షలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లీ సాయిశ్రీ, మధ్యవర్తులు హీనా, అభినవ్, భవాని, కారు డ్రైవర్ అశోక్ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


