కాకతీయ, నేషనల్ డెస్క్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 49 మందిపై కోటి ఆరు లక్షల రూపాయల రివార్డు ఉండడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దే లక్ష్యం ఉన్నదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, భీకరమైన ఎన్‌కౌంటర్లు, ఆపరేషన్ కగార్ వంటి ప్రభుత్వ చర్యల కారణంగా పెద్దసంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు. ఫలితంగా కొందరు లొంగిపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్టుల పక్కా నష్టం తగిలింది. దంతేవాడ జిల్లాలో గత 19 నెలల్లో 461 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 129 మందిపై రివార్డు కూడా ఉంది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కోసం రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వ్యవసాయ భూములు కేటాయిస్తుంది.
హయ్యెస్ట్ రివార్డు ఉన్న 9 మంది నక్సల్స్‌ను ఇప్పటికే హతమార్చారు. తాజాగా (సెప్టెంబర్) బస్తర్‌లో అత్యధిక లొంగుబాటు జరిగింది. దంతేవాడలో 71 మంది నక్సలైట్లు ఒకేసారి ప్రభుత్వ ఎదుట వచ్చారు. వారు లోన్ వరెంట్ (ఇంటికి తిరిగి రండి) ప్రచారం ప్రభావంతో లొంగిపోయారని తెలిపారు. అయితే, బస్తర్‌లో ఇంకా చాలా మంది నక్సలైట్లు చురుకుగా ఉన్నారు. గతంలో వారు రోడ్లు తవ్వడం, చెట్లు నరికివేయడం, మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు పంచడం, పోలీసులు మరియు పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం వంటి అనేక హింసాత్మక చర్యల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం, ఉపాధి అవకాశాలు, వనరులు, సౌకర్యాలు అందించడం జరుగుతోంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు, రవాణా, విద్యుత్, నీటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజలకు చేరడం కొనసాగుతున్నాయి. ఈ చర్యల వల్ల మావోయిస్టుల వ్యాప్తి తగ్గి, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు రహిత భారత్ లక్ష్యానికి దిశగా కేంద్రం ముందుకెళ్తోంది.


