తెలంగాణ అభివృద్ధికి చర్యలపై కావ్య ప్రశ్నలు
పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేంటన్న ఎంపీ

కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోక్ సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సంబంధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ మంత్రి జితిన్ ప్రసాద్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం మరియు స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ కారిడార్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం ద్వారా వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేస్తూ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల స్థితిగతులు, అమలులో ఉన్న కార్యాచరణ ప్రణాళికలను వాటి పురోగతిపై త్వరలో మరింత సమాచారం వెల్లడిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ అభివృద్ధి దేశవ్యాప్తంగా పారిశ్రామిక కనెక్టివిటీని మెరుగుపరచడంలో భాగంగా, భారత ప్రభుత్వ సమగ్ర ఆర్థిక దృక్పథానికి అనుగుణంగా సాగుతోందని మంత్రి వివరించారు. పారిశ్రామిక కారిడార్ల పురోగతిపై కేంద్రం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని కొనసాగిస్తోందని తెలియజేశారు. ఈ ప్రకటనపై స్పందించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్రం సహకారం కొనసాగాలని ఆశించారు. పారిశ్రామిక కారిడార్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలతో పాటు, ప్రాంతీయ అభివృద్ధి సాద్ద్యం అవుతుందని అన్నారు.


