బీజేపీ అభ్యర్థికి ‘సున్నా’ ఓట్లు!
సర్పంచ్ ఎన్నికల్లో అరుదైన పరిణామం
తనకే తానూ ఓటు వేయలేదా? – గ్రామంలో చర్చ
నోటాకు ఒక్క ఓటు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
నర్సంపేట నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన
కాకతీయ, నర్సంపేట : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కీర్యా తండాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 17న నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోడ గౌతమికి ఒక్క ఓటు కూడా పడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామపంచాయతీలో మొత్తం 239 ఓట్లు పోలవగా, బీజేపీ మద్దతు ప్రకటించిన అభ్యర్థికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. ఇది గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. “అభ్యర్థి తనకే తానూ ఓటు వేసుకోలేదా?” అంటూ గ్రామంలో జోరుగా చర్చ జరుగుతోంది.

నోటాకు ఒక్క ఓటు
ఈ ఎన్నికల్లో నోటాకు ఒక్క ఓటు పడటం మరో విశేషం. అభ్యర్థికి సున్నా ఓట్లు రావడం, నోటాకు మాత్రం ఓటు పడటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. స్థానికంగా బీజేపీ బలం ఎంత అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఘటనను కొందరు కమలహాసన్ నటించిన ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ సినిమా సన్నివేశంతో పోలుస్తున్నారు. ఆ సినిమాలో కాలేజీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి తానే మరో అభ్యర్థికి ఓటు వేయడంతో ఒక్క ఓటే రావడం గుర్తు చేస్తూ, “ఇక్కడ కూడా అలానే జరిగిందేమో” అంటూ నవ్వులు నవ్వుతున్నారు. ఏదేమైనా, గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాకపోవడం జిల్లా రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా నిలిచింది.


