విదేశీ ఉద్యోగాల పేరిట యువత అక్రమ రవాణా
లావోస్ సైబర్ మోసాల గ్యాంగ్ బండారం బట్టబయలు
ఉద్యోగాల ముసుగులో లక్షల వసూళ్లు.. అంతర్జాతీయ ముఠా అరాచకం
హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రధాన నిందితుడు అరెస్ట్
థాయ్‌లాండ్ నుంచి లావోస్‌కు అక్రమ తరలింపు.. పాస్‌పోర్టులు స్వాధీనం
యువతతో సైబర్ మోసాలు చేయించిన గ్యాంగ్‌పై కేసు నమోదు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : విదేశాల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువతను థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు అక్రమంగా తరలించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఈ ముఠా బండారాన్ని బయటపెట్టారు. కేసులో ప్రధాన నిందితుడు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ (38)ను ఫిబ్రవరి 17న హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంకాక్ నుంచి లావోస్‌కు అక్రమ తరలింపు
పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు తన సహచరులతో కలిసి జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతను విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. బాధితులను ముందుగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు పంపించి అక్కడి నుంచి అక్రమంగా లావోస్‌కు తరలించినట్లు వెల్లడైంది. అక్కడికి చేరుకున్న తర్వాత వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని చైనా ముఠాతో కలిసి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు చేయించేవారని పోలీసులు తెలిపారు. అమెరికా మహిళల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడేలా బాధితులను బలవంతం చేసినట్లు గుర్తించారు.
ఒక్కో వ్యక్తిపై రూ.1.75 లక్షల కమిషన్
ఈ అక్రమ రవాణా ద్వారా ఒక్కో వ్యక్తిపై సుమారు రూ.1.75 లక్షల వరకు కమిషన్ పొందినట్లు విచారణలో తేలింది. ఈ ముఠాలో మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యాంరావు రాజశేఖర్‌తో పాటు లావోస్‌లో ఉన్న రాజు (వైజాగ్) కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకాక్‌లో కాల్ సెంటర్ ఉద్యోగాల పేరుతో పలువురిని విదేశాలకు పంపించి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. కొంతమంది బాధితులు మోసపోయిన విషయం తెలుసుకుని భారత్‌కు తిరిగి రాగా, మరికొందరు ఇప్పటికీ విదేశాల్లోనే ఉన్నట్లు సమాచారం.
విదేశీ ఉద్యోగాల మోసాలపై పోలీసుల హెచ్చరిక
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే అనుమానాస్పద ఏజెంట్లను నమ్మవద్దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ యువతకు సూచించారు. విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్లు, సంస్థల గుర్తింపు వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కేసు వివరాలను వెల్లడించిన మీడియా సమావేశంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్‌ఐలు ఉమాసాగర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


