మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం అవసరం
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం బ్యూరో : మాదకద్రవ్యాలు వ్యక్తి మాత్రమే కాదు కుటుంబం, సమాజాన్ని కూడా నాశనం చేసే ప్రమాదకర శక్తి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. నగరంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో పోలీసు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, మేయర్ నీరజ పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, డ్రగ్స్ విక్రయం, రవాణా, వినియోగంపై సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు.
అవగాహన కార్యక్రమాలు పెంచాలి
పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనించాలని తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించాలని అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాలని అన్నారు. డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా బాధితులకు కౌన్సెలింగ్ అందిస్తున్నామని తెలిపారు. రిహాబిలిటేషన్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ విజేత, సిఇవో ప్రవీణ్ కుమార్, ఆటో యూనియన్ నాయకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.


