యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సేవాభావంతో ముందుకు సాగాలి
సీనియర్ జర్నలిస్టు జిన్నా లచ్చయ్య
కాకతీయ, మరిపెడ : యువత గంజాయి, గుటకా, సిగరెట్లు తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్ జర్నలిస్టు జిన్నా లచ్చయ్య పిలుపునిచ్చారు. సోమవారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఎన్నికల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 30 ఏళ్లుగా అంబేద్కర్ ఆశయాలతో యువజన సంఘం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శ్రమదానం, అక్షరాస్యత, మహిళలు–యువతకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేయడం ప్రశంసార్హమన్నారు. యువకులు మంచి అలవాట్లు అలవర్చుకుని చదువు, ఉద్యోగాల వైపు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సంఘానికి సేవలందించిన జినక నాగరాజును సన్మానించారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా జినక ప్రమోద్, ఉపాధ్యక్షుడిగా జిన్న సంపత్‌తో పాటు ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.


