యువత రాజకీయాల్లో రాణించాలి
ప్రజా ప్రతినిధులుగా ఎదగాలి
స్థానిక సమస్యలపై పోరాడాలి
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ పార్లమెంట్ బీజేవైఎం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ లో బుధవారం బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్, మాజీ శాసనసభ్యుడు మార్తనేని ధర్మారావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే యువశక్తి భారతదేశంలోనే ఉందని, యువత రాజకీయాల్లో రాణించడం అనేది సమాజానికి చాలా ముఖ్యమని అన్నారు. యువత తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవడం, విద్యార్థుల, ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో ఎన్నికల్లో గెలిచిందని, ఆ హామీలను ప్రాక్టికల్‌గా అమలు చేసే పరిస్థితి లేదని గంట రవికుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు హాలీడేస్ ఉండవని, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పిట్టల భరత్, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


