యువత ప్రతిభకు వేదికగా యువజనోత్సవాలు
కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్: యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు గొప్ప వేదికగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యువజన,క్రీడాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఆమె స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి యువకుడు, యువతిలో ఒక ప్రత్యేక కళ దాగి ఉంటుందని, యువజనోత్సవాలు ఆ ప్రతిభను వెలుగులోకి తెస్తాయని తెలిపారు. స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో సాగాలని సూచించారు. యువతే దేశ భవిష్యత్తని, క్రమశిక్షణతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజ సేవలో భాగస్వాములై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న యువజన స్వచ్ఛంద సేవకులకు జ్ఞాపికలు, ప్రతిభ కనబరిచిన విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, సైన్స్ మేళా సందర్శకులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, యువజన,క్రీడాధికారి శ్రీనివాస్, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్‌ప్రకాశ్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, వివిధ యువజన అవార్డు గ్రహీతలు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


