గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం
కాకతీయ, రాయపర్తి : గుర్తుతెలియని వాహనం ఢీకొని మండలంలోని పెరికేడు గ్రామానికి చెందిన యువకుడు గాదె ఆంజనేయులు దుర్మరణం చెందాడు. మృతుడి భార్య జ్యోతి కథనంప్రకారం గత రెండు సంవత్సరాలుగా జమ్మికుంటలో నివాసం ఉంటూ ఆంజనేయులు బిర్యానీ మాస్టారుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. బోనాల పండుగ నేపథ్యంలో ఆంజనేయులు, భార్య జ్యోతి, కూతురుతో కలిసి స్వగ్రామమైన పెరికేడుకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇంట్లో ఫ్యాన్ పనిచేయకపోవడంతో సాయంత్రం 4:30గంటలకు రిపేర్ చేపించుకొని వస్తానని ద్విచక్ర వాహనంపై రాయపర్తికి వచ్చాడు. రాత్రి 8 గంటలకు తిరిగి భార్యకు ఫోన్ చేసి సోదరుడు సంతోష్ ఇంట్లో పడుకొని ఉదయం లేవగానే ఇంటికి వస్తానని చెప్పినట్లు జ్యోతి తెలిపింది. గురువారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆంజనేయులు మృతి చెందినట్లు గుర్తించారు. వివరాలు సేకరించి మృతుడి భార్య జ్యోతికి సమాచారం అందించగా, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు.


