- సూసైడ్ నోట్‌లో అధికారుల పేర్లు
- తన భూమి నుంచి అక్రమంగా సీసీ రోడ్డు వేశారని ఆవేదన
- ‘ప్రజాప్రతినిధి’ సిఫారసుతోనే ప్రైవేటు రోడ్డు..?
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడు ఆత్మ హత్యాయత్నం చేశాడు. మహబూబాబాద్ మండలం మాదపురం గ్రామానికి చెందిన కంబాల సంపత్ అనే యువకుడు పోలీసుల వేధింపులు, నిర్బంధం తట్టుకోలేక పురుగుల మందు తాగుతున్నట్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే..అతడు తాతల కాలం నుంచి సాగుచేసుకుంటూ వస్తున్న పూర్వీకుల వ్యవసాయ భూమి నుంచి అక్రమంగా సీసీ రోడ్ వేయడాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ వివాదంలో తల దూర్చిన కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్, సీరోల్ మండల విద్యా అధికారిగా పనిచేస్తున్న ఇస్లావత్ లచ్చిరాం ఆగ్రహంతో వ్యవహరించి సంపత్‌పై అక్రమ పోలీస్ కేసులు నమోదు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా వివాదానికి కారణమనరైన సదరు సీసీ రోడ్డు ను మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సిఫారసుతో నిర్మించారని తెలుస్తోంది. అయితే ఆ రోడ్డు ప్రజా ప్రయోజనానికి కాకుండా ఒక స్థానిక వ్యాపారి కోళ్ల ఫామ్‌కు దారి కోసం వేశారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రజాప్రయోజనాన్ని పక్కనబెట్టి ప్రైవేటు వ్యక్తి కోసం అధికార దుర్వినియోగం చేయడం సరికాదని స్థానికులు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వైపు నుంచి తీవ్రమైన ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడటంతో బాధితుడు గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి లెటర్ రాసినట్లు తెలుస్తోంది.
కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్, ఇస్లావత్ లచ్చిరాం, ఇస్లావత్ వెంకన్నలే తన చావుకు కారణం అంటూ లేఖలో బాధితుడు పేర్కొన్నాడని సమాచారం. కాగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కంబాల సంపత్‌ను కుటుంబ సభ్యులు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యపరిస్థితిపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని గ్రామస్థులు, బంధువులు, స్థానిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


