కాకతీయ, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న ఘోర సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత అన్నను తమ్ముడు హత్య చేశాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామానికి చెందిన మాధవరావు (35), సాంబశివరావు సోదరులు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి పంచుకోల విషయంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు, ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మాధవరావు, సాంబశివరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం ఘర్షణకు దారితీయగా, సాంబశివరావు ఆవేశానికి లోనై ఇంట్లో ఉన్న గడ్డపార తీసుకుని మాధవరావు తలపై బలంగా దాడి చేశాడు. దీంతో మాధవరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
సంఘటనకు సంబంధించి భయాందోళనకు గురైన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన తర్వాత సాంబశివరావు, స్వయంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


