సీఐటీయూలో చేరిన యువ కార్మికులు
కాకతీయ, కొత్తగూడెం : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ముందుండే సీఐటీయూ సంఘంలో యువ కార్మికులు చేరడం అభినందనీయమని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ కేంద్రంగా నిర్వహించిన కార్యక్రమంలో హైట్ శివ ఆధ్వర్యంలో ముప్పై ఐదు మంది యువ కార్మికులు సీఐటీయూ సంఘంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, జీతాలు, కుటుంబాల శ్రేయస్సు కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తూ కార్మిక వర్గానికి అండగా నిలుస్తోందన్నారు. పోరాటాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తూ కార్మికులను సన్మార్గంలో నడిపిస్తున్న సంఘమని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఓసి వంటి పరిశ్రమల్లో స్థానిక యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన యాజమాన్యం మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఓసి ప్రభావిత ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే నిరుద్యోగులతో కలిసి దశల వారీగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కన్వీనర్ భూక్య రమేష్, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వై వెంకటేశ్వరరావు, సురమైలయ, కె రమేష్ బాబు, గోసు సుబ్బారావు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు అల్లి నాగయ్య, పప్పుల ప్రమోద్, కట్ట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


