ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్!
నగర సమస్యల పరిష్కారానికి సీఎం కొత్త ప్రయోగం
గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్‌పై ప్రత్యేక ఫోకస్
క్షేత్రస్థాయిలో పనిచేసే యువ అధికారులకు కీలక బాధ్యతలు
హైదరాబాద్–సైబరాబాద్–రాచకొండతో పాటు ఫ్యూచర్ సిటీపై దృష్టి
అనుభవం–ఉత్సాహానికి సమతుల్యం చేసిన బదిలీలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. నగరవాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ముఖ్యమంత్రి యువ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దించారు. శనివారం విడుదలైన ఐపీఎస్ బదిలీల ఉత్తర్వుల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి, తాజాగా ట్రాఫిక్ సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్న యువ అధికారులతో నగర ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేయాలన్నది ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది.

గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ బలోపేతం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ బదిలీల ప్రధాన ఉద్దేశం. జిల్లాల్లో అదనపు ఎస్పీలుగా సమర్థవంతంగా పనిచేస్తున్న యువ అధికారులను ఎంపిక చేసి, నగరంలో ట్రాఫిక్ డిసిపిలుగా నియమించారు. ఈ క్రమంలో కొత్తగూడెం ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా ఉన్న అవినాష్ కుమార్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి–1గా నియమించారు. ఉట్నూరు అదనపు ఎస్పీ కాజల్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి–2 బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల అదనపు ఎస్పీ ఎస్. శేషాద్రిని రెడ్డిని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి–2గా, భువనగిరి అదనపు ఎస్పీ కనకాల రాహుల్ రెడ్డిని మల్కాజ్‌గిరి కమిషనరేట్ ట్రాఫిక్ డిసిపి–1గా నియమించారు.

ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక ప్రాధాన్యం
ములుగు జిల్లా ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా పనిచేసిన శివం ఉపాధ్యాయను ప్రతిష్ఠాత్మక ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డిసిపిగా నియమించడం గమనార్హం. రైల్వేస్ డిఐజిగా ఉన్న జి. చందనా దీప్తిని ఫ్యూచర్ సిటీ అడ్మిన్ మరియు ట్రాఫిక్ అదనపు సీపీగా నియమించారు. హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా ఉన్న బికే రాహుల్ హెగ్డేకు అదే కమిషనరేట్‌లో ట్రాఫిక్ డిసిపి–3 బాధ్యతలు అప్పగించగా, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా ఉన్న జి. రంజన్ రతన్ కుమార్‌ను అక్కడే ట్రాఫిక్ డిసిపి–1గా కొనసాగించారు.

అక్రమాల అడ్డుకట్టకూ చర్యలు
ట్రాఫిక్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమాలను అడ్డుకునే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో డిఐజిగా అభిషేక్ మహంతిని నియమించారు. సహజ వనరుల దోపిడీని అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నదే ఈ నిర్ణయ లక్ష్యంగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, తాజా ఐపీఎస్ బదిలీల్లో అనుభవానికి, యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పోలీసు వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ట్రాఫిక్ సమస్యలకు ఈ ‘యువ ఐపీఎస్ ట్రీట్మెంట్’ ఎంతవరకు ఫలితాలు ఇస్తుందన్నది వేచి చూడాల్సిందే.


