- స్వామి సాక్షిగా ప్రమాణానికి నేను సిద్ధం, హరీష్ రావు సిద్ధమేనా..?
- దండుపాళ్యం క్యాబినెట్ అంటావా?
- నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి?
- ఇది ప్రజా ప్రభుత్వం, మీలా మాఫియా పాలన కాదు
- డేట్, టైం చెప్పు.. నేను సిద్ధం, నువ్వే రావాలి
- బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మంత్రి అడ్లూరి సవాల్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తా క్యాబినెట్‌లో జరిగిన ప్రతీ విషయాన్ని సిద్ధిపేట వెంకటేశ్వర స్వామి మందిరం ఎదుట చెబుతా, నేనే డేట్ చెబుతున్నా, వచ్చే శనివారం రా. లేకపోతే నువ్వు డేట్, టైం చెబితే నేనే వస్తా. ప్రజల ముందే ఎవరు నిజం చెబుతున్నారో తేల్చుకుందాం’’ అంటూ హరీష్ రావుకు మంత్రి అడ్లూరి బహిరంగంగా సవాల్ విసిరారు. ‘‘బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రజా ప్రభుత్వం అని, అలాంటి కేబినెట్‌ను దండుపాళ్యం అంటూ మాట్లాడటం నీ స్థాయి చూపిస్తుంది. నీతి, ధర్మం ఉంటే నా సవాల్‌కు సిద్ధంగా ఉండు’’ అని అడ్లూరి అన్నారు. తమ కుటుంబ సభ్యురాలు కవిత నేరెళ్ల ఘటన పై బహిరంగంగా మాట్లాడారు. ఆమెరి వ్యాఖ్యలపై నువ్వేమైనా సమాధానం ఇచ్చావా ? అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పేరు వస్తే కూడా మౌనంగా ఉండిపోయారు. నిజంగా నీతిమంతుడివైతే నీ ఇంట్లోని విషయాలకు సమాధానం చెప్పిన తరువాతే తమతో వాదించు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా కూలింది ? వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎవరు దోచుకున్నారు ? మీ పాలనలో రైతుల ధాన్యాన్ని కొనలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. నువ్వు రబ్బరు చెప్పులతో తిరిగినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఆస్తులు ఎలా పెరిగాయి ? ప్రజలకు ఇవన్నీ తెలియకుండా చేయలేవు అని హరీష్‌పై ఆరోపణలు గుప్పించారు.
దళితుల ఉన్నతిని తట్టుకోలేరు..
‘‘దళితులు, బీసీలు మంత్రివర్గంలో ఉండటం నీవు తట్టుకోవడం లేదు. గతంలో డిప్యూటీ సీఎం రాజయ్య, కొప్పుల ఈశ్వర్ ను ఎలా అవమానించావో ప్రజలకు తెలుసు. ఇప్పుడు నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నావు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం దళిత, బలహీన వర్గాలకు న్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి స్వయంగా నన్ను పక్కన కూర్చోబెట్టుకుని మంత్రివర్గ సమస్యలపై చర్చిస్తున్నారు. ఇది నీకు అసహనంగా మారింది‘‘ అని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై తమ చిత్తశుద్ధిని ప్రశ్నించడం సరైంది కాదని అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజున కేసీఆర్ ఎందుకు రాలేదు ? దళిత, బీసీ వర్గాలు అంటే మీకెప్పటికీ చులకన భావనే గత పార్లమెంట్ ఎన్నికల్లో మీ కార్యకర్తలే బీజేపీకి ఓట్లు వేయమనడం నిజం కాదా ? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
ప్రభుత్వానికి మూడేళ్ల సమయం ఉందని, ఆ సమయానికల్లా ప్రతి హామీని నెరవేర్చుతామని తెలిపారు. సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్, దండి రవీందర్, చెర్ల పద్మ, సమద్ నవాబ్, కొట్టే ప్రభాకర్, నాగరాజు, శిల్ప తదితరులు పాల్గొన్నారు.


