కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. తెలంగాణ భవన్ వేదికంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి కట్ల పాము లాంటివాడని..ఉప ముఖ్యమంత్రిని చేసి.. మళ్ళీ సిట్టింగ్ ను కాదని ఎమ్మెల్యేను చేసి చివరకు తన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు పార్టీ పిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తీసుకునే వయస్సులో అప్రతిష్టను మూటకట్టుకుని ఒరుగళ్లు పరువు తీశారంటూ విమర్శలు చేశారు. కేటీఆర్ పొగబెట్టి అష్టదిగ్బ్రంధనం చేస్తే కాంగ్రెస్ లో చేరినట్టు బహిరంగంగా ఒప్పుకున్నాడనీ సెటైర్లు విసిరారు.
ఒక ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి సమాజానికి మీరిచ్చే సందేశం ఇదేనా? మీ 40 ఏళ్ల రాజకీయం నేర్పింది ఏంటి? అభివృద్ధి కోసం పార్టీ మారాలి? అడ్డదారులు తొక్కాలి? నమ్మినవాళ్ళను నయ వంచన చెయ్యాలనేనా? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నియోజకవర్గం లో ప్రజలను ఓట్లు అడుగుతారు.? 40 ఏళ్లు కాంగ్రెస్ పై పోరాటం చేసి ఇప్పుడు వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవించడానికి వెళ్ళిన మీరు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వాళ్ళ మద్దతు కోరుతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..
మీ శ్రమను సొమ్ముచేసుకోవడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడియం ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపడానికి బీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కడియంను కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల ఒడిస్తారు అంటూ జోస్యం చెప్పారు. కడియం శ్రీహరి నయవంచనకు స్టేషన్ ఘనపూర్ తల దించుకుంటుందని.. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చిన KCR గారి నాయకత్వంలో గులాబీ జెండానే ఎగురుతుందనీ ధీమా వ్యక్తం చేశారు.


