యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి
హక్కుల సాధనకు రాజకీయ బలం అవసరం
మున్సిపల్ ఎన్నికల్లో ఐక్యతతో ముందుకు సాగాలి
అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లిబాబు యాదవ్
కాకతీయ, ఖమ్మం : యాదవులు తమ సాంప్రదాయ గొర్రెల పెంపకం వృత్తితో పాటు రాజకీయంగా కూడా బలంగా ఎదగాల్సిన అవసరం ఉందని అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య పిలుపునిచ్చారు. రాజకీయ నిర్ణేత శక్తిగా మారినప్పుడే యాదవులకు న్యాయం, హక్కులు సాధ్యమవుతాయని వారు స్పష్టం చేశారు. ఖమ్మంలోని చిత్తారు శ్రీహరి అఖిలభారత యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లోదిగ వెంకన్న, *దుబాకుల శ్రీనివాస్ యాదవ్*తో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా యాదవ సంఘం క్యాలెండర్‌లను ఆవిష్కరించారు.
ఎన్నికల్లో ఐక్యతే కీలకం
మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గత సర్పంచ్ ఎన్నికల్లో యాదవులు గణనీయంగా విజయం సాధించినప్పటికీ, జనాభా నిష్పత్తికి తగిన స్థాయిలో ఇంకా మెరుగైన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వర్గాలకతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల సహకారంతో యాదవులు ఐక్యంగా ముందుకు వచ్చి ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యాదవ ప్రముఖులు మాట్లాడుతూ… బీసీ వర్గాల్లో యాదవులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన స్థాయిలో ఎదగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు పరిష్కారంగా గొర్రెల పెంపకం వృత్తితో పాటు విద్యకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యువత చదువుతో పాటు సంఘటితంగా రాజకీయాల్లో పాల్గొంటేనే భవిష్యత్తు భద్రమని అన్నారు. ప్రభుత్వ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా యాదవ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణం మంజూరు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఇతర కుల సంఘాల మాదిరిగా ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల సంఘం సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఇవి అమలైతే యాదవ వృత్తిదారులకు ఆర్థిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, పొదిల సతీష్, పొదిలి తిరుపతిరావు, కనక బండి విజయలక్ష్మి, రాగం కోటేశ్వరరావు, సత్తి వెంకన్న, తోడేటి లింగరాజు, మురిమేకల కోటయ్య, వాకధాని కోటేశ్వరరావు, చిత్తారు సిద్ధు, బొల్లి కొమరయ్య, చల్ల వెంకటేష్, వాగదాని రాజు, రాగం బాబురావు తదితరులు పాల్గొన్నారు.


