కాకతీయ, హనుమకొండ : వరంగల్ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలు, ప్రముఖ సాహిత్యకారిణి అనిశెట్టి రజిత ఆకస్మిక మృతి పట్ల వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రచయిత్రిగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక ఉద్యమాల పట్ల అంకితభావం, సామాజిక సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలతో తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన రజిత మరణం తీరని లోటు అని ఆమె అన్నారు.
తన రచనల ద్వారా సమాజ సమస్యలను ఆవిష్కరించడంలో, స్త్రీ స్వాభిమానానికి, సమాన హక్కుల సాధనకు రజిత గారు బలమైన స్వరం వినిపించారని గుర్తుచేశారు. ఆమె ఆకస్మిక మరణం వరంగల్ సాహిత్య వర్గాలకే కాకుండా మొత్తం తెలుగు సాహిత్య కుటుంబానికి పెద్ద నష్టం అని డా. కావ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా రజిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.


