వావ్ .. వైభవ్
కళ్లు చెదిరే క్యాచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
సూర్యవంశీ క్యాచ్ పట్టిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్
కాకతీయ, స్పోర్ట్ డెస్క్ : అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటాడు. బౌండరీ లైన్ వద్ద ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి భారత జట్టుకు కీలకమైన వికెట్‌ను అందించాడు. దీంతో జట్టు విజయంలో బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ భాగమైన సూర్యవంశీపై ప్రశంసలు కురుస్తున్నాయి. సూర్యవంశీ క్యాచ్ పట్టిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూపర్ క్యాచ్
రెండో ఇన్నింగ్స్‌లో 26వ ఓవర్‌ను ఆఫ్ స్పిన్నర్ విహాన్ మల్హోత్రా వేశాడు. విహాన్ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ మహ్మద్ సమీయున్ బసిర్ రతుల్ లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. దీంతో ఆ బంతి సిక్స్ వైపునకు దూసుకెళ్లింది. అయితే లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యవంశీ నమ్మశక్యం కానీ రీతిలో బంతి స్టాండ్స్‌లోకి వెళ్లకుండా ఆపగలిగాడు. సిక్స్ దిశగా వెళ్తున్న బంతిని బౌండరీ లైన్ వద్ద కళ్లుచెరిదే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. వెంటనే బౌండరీ లైన్ దాటకుండా తనను తాను కంట్రోల్ చేసుకోడానికి బంతిని స్టేడియంలోకి విసిరేశాడు. ఆ తర్వాత బౌండరీ లైన్లో కాలు పెట్టి, తిరిగి మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఇదంతా ఒక్క సెకన్లో జరిగిపోయింది. అలా వైభవ్ క్యాచ్ అందుకోవడంతో మహ్మద్ సమీయున్ ఔట్ అయ్యాడు. ఇది టీమ్ఇండియాకు చాలా కీలకమైన వికెట్ అయ్యింది. ఎందుకంటే ఆ తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పుంజుకోలేకపోయింది. చివరికి భారత జట్టు చివరికి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.


