- హుజురాబాద్‌లో వానర సైన్యం స్వైర విహారం
- బయటకెళ్లాలంటే జంకుతున్న జనం
- కోతి దాడి చేయడంతో గాయపడి మృతి చెందిన ఓ వ్యక్తి
- అనేక మంది చిన్నారులు, వృద్ధులకు గాయాలు
- సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని అధికారులు
- కోతుల బెడదతో వణికిపోతున్న హుజురాబాద్ జనం
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణం నిండా వానర సైన్యం స్వైర విహారం చేస్తోంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా వానరాలు దర్శనమిస్తున్నాయి. జనాల మీద దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై దాడులకు పాల్పడుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. వానరలను బంధించి అటవీ ప్రాంతాల్లో వదిలేయాల్సి ఉండగా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వానరాల బెడద పట్టణంలో రోజు రోజుకు ఎక్కువవుతోంది. పాఠశాలలకు, కూరగాయలకు, సరుకులు తెచ్చేందుకు అడుగు బయటపెట్టాలంటె జంకుతున్నారు.
కోతి దాడితో గాయపడి..మృత్యువాత
హుజురాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బూర సుదర్శన్ పై ఇటీవల కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించాడు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి, పాతవాడకు చెందిన ఓ మహిళ, విద్యానగర్ కు చెందిన ఓవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు నిత్యం ఏదో ఒక చోట కోతుల దాడిలో గాయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఇంటి పరిసరాల్లో పనులు చేసుకుంటున్న వృద్ధులు, మహిళలపై కోతులు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. అలాగే, ఇండ్లలోకి చొరబడి పప్పులు, బియ్యం, కూరగాయలు, తినుబండారాల వంటి వంట సరుకులను ఎత్తుకెళ్తున్నాయి. ఇంటి ఆవరణలోని పంపు సెట్లు, వాటర్ ట్యాంకులు, నల్లా కనెక్షన్లను విరగ్గొడుతూ ఆస్థి నష్టం కలిగిస్తున్నాయి. పట్టణంలోని సూపర్ బజార్ లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇళ్ల నుంచి పడేసే వ్యర్థాలకు అలవాటు పడి సమీపంలోని దుకాణ సముదాయాలు తెరిచే వరకు రోడ్ల పై నుంచి కదలడం లేదు. రోడ్లపై నిర్వహిస్తున్న కూరగాయలు, పండ్ల బండ్లపై దాడులకు దిగుతున్నాయి.
ఎమ్మెల్యే హామీ ఇచ్చినా.. అధికారులు చర్యల్లేవ్..!
ఇటీవల బతుకమ్మ పండుగ సందర్భంగా జరిగిన రివ్యూ మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోతుల సమస్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రజల భద్రత దృష్ట్యా కోతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కోతల సమస్య నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. కోతులను బంధించి, వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం ఇంటి బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. కోతులు గుంపులు గుంపులుగా చేరుకుని ఇండ్లలోకి చొరబడుతున్నాయి. చేతిలలో కర్ర ఉన్నా కోతులు భయపడడంలేదు. కోతులను కర్రతో కొట్టేందుకు వెళితే మీదికే ఉరికివస్తున్నాయి. కోతుల బెడదకు అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.


