కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల, లోపలి భాగంలోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువ సవరణపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీతోపాటు 20 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో భూముల మార్కెట్ విలువ సవరణపై జిల్లా అదనపు కలెక్టర్ నేత్రుత్వంలో ఉండే కమిటీలు సమావేశం అయ్యాయి. ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న విలువ, సవరణకు ఉన్న అవకాశాల ప్రతిపాదనలపై ఈ కమిటీలు చర్చించి ఆమోదించి ప్రభుత్వానికి పంపించాయి.
ముఖ్యమంత్రి స్థాయిలోనూ ఇటీవలే ఈ విలువ సవరణపై చర్చ జరిగింది. వచ్చే మంత్రి మండలి సమావేశంలో సవరణ నోట్ ను ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. కేబినెట్ ఆమోదం లభిస్తే సవరణ ధరలపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.తర్వాత వీటి అమలుకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని రిజిస్ట్రేషన్ల వర్గాలు వెల్లడించాయి.


