గడువులోగా పనులు పూర్తి చేయాలి
నూతన బస్టాండ్ పనులను పరిశీలించిన కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశాలు
కాకతీయ, వరంగల్ : నిర్దేశిత గడువులోగా వరంగల్ నూతన బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని పాత ఆర్టీసీ బస్ స్టేషన్ స్థలంలో నిర్మాణంలో ఉన్న అధునాతన బహుళ అంతస్తుల బస్టాండ్ పనులను కమిషనర్ పరిశీలించారు. ఐదు అంతస్తులతో నిర్మించనున్న ఈ బస్టాండ్ భవనం పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పనులు వేగంగా సాగడంతో పాటు నాణ్యత ప్రమాణాలకు లోబడి పూర్తి అయ్యేలా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
నాణ్యతలో రాజీ వద్దు
నూతన బస్టాండ్ నగరానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కమిషనర్ కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వివరించగా, మిగిలి ఉన్న లైటింగ్, చిన్నపాటి ప్యాచ్ వర్క్ పనులను త్వరితగతిన పూర్తి చేసి గార్డెన్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి అజిత్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ రఘునాథ్, హార్టికల్చర్ ఆఫీసర్ ఆసిఫ్, పిఎంసి ఆనంద్ వోలెటి, కాంట్రాక్టర్లు తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు.


