కాకతీయ, ములుగు ప్రతినిధి: ఆదివాసీల ఆచారాలు దెబ్బ తినకుండా మేడారంలోని అమ్మవార్ల గద్దెలను సుందరంగా తీర్చిదిద్దుతామని, యుద్ధ ప్రాతిపదికన గుడి నిర్మాణ ఏర్పాట్లు చేసి భక్తులకు అందుబాటులో తేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. గిరిజనుల ఆచారాలు సాంప్రదాయాలు పూజారుల అభిప్రాయం మేరకే నూతన గుడి నిర్మాణ ఏర్పాట్లు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.
సోమవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయం ప్రాంగణంలో గిరిజన పూజారులు, ఆర్కిటిక్, దేవాదాయ అధికారులతో కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పీ డాక్టర్ శబరీష్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావుతో కలిసి మంత్రి మాట్లాడారు. సమ్మక్క సారలమ్మ జాతరలో సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, గుడి ప్రాంగణాన్ని మార్పులు చేయడంలో గత కొద్ది రోజులుగా పూజారులతో సమావేశం అవుతున్నామని అన్నారు.
సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు గోత్రాల ప్రకారం గుడి నిర్మాణ ఏర్పాట్లు జరుగుతాయని, దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించామని తెలిపారు. గద్దెల మార్పిడి వలన అపచారం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయా పూజారుల అభిప్రాయం మేరకే పనులు కొనసాగుతాయని, గద్దెల ప్రాంతాన్ని 20 ఫీట్ల వెడల్పుతో 80 ఫీట్ల పొడుగుతో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. తల్లుల దీవెనల కోసం సీఎం మేడారం రానున్నారని సీతక్క తెలిపారు.
వనదేవతల చరిత్రపై ఏడు వందల రూపాలను పూజారులు గుర్తించి ప్రతిపాదించారని, పరిశీలించి గుడి చుట్టూ ఏర్పాటు చేయబోతున్నామని, నూతన గుడి నిర్మాణం భక్తులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. పూజార్ల సంఘం అధ్యక్షుడు జగ్గారావు మాట్లాడుతూ గుడి నిర్మాణం చేస్తామని పాలకులు హామీ ఇవ్వడంతోనే తాము అనుమతి ఇస్తున్నామని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సహకరిస్తామని అన్నారు.
నూతన గుడి నిర్మాణం ఏర్పాట్లపై పలు సంఘాల నాయకుల ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీవో వెంకటేష్, ఈ ఓ వీరస్వామి, గిరిజన పూజారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


