మేడారంలో పనుల్లో వేగం పెంచాలి: మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : జాతర సమీపిస్తుండటంతో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి, సౌకర్యాల పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కెకాన్, ఐ టి డి ఏ పీవో చిత్ర మిశ్రాలతో కలిసి మేడారం మ్యూజియం, చిలకలగుట్ట, ఊరట్టం కాజ్ వే, జంపన్న వాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ శుక్రవారం లోపు ఆర్చ్ పిల్లర్లు, సంబంధిత నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మేడారంలో సభ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించి ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు ముక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శనాలు కల్పించాలని, ప్రతి పనిని గడువులోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి కావాలని, ప్రతి శాఖ బాధ్యతగా పనిచేయాలనిమంత్రి స్పష్టం చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


