గ్రామ సమగ్రాభివృద్ధికి మహిళా నాయకత్వమే బలం
తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత తిరుపతి
కాకతీయ, శంకరపట్నం : గ్రామ సమగ్ర సంక్షేమ సాధనలో మహిళా నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత తిరుపతి పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఈనెల 16 నుంచి 19 వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళా నాయకుల సామర్థ్యాలను పెంపొందించడం, స్థానిక పాలనలో వారి పాత్రను బలోపేతం చేయడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, సమగ్ర సంక్షేమం సాధనలో మహిళలు ముందుండాలని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేసిందన్నారు. మహిళా సాధికారతకు దిశానిర్దేశం చేసే అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారని తెలిపారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ శిక్షణలో జీకే బంజారా సర్పంచ్ మాలోత్ జ్యోతి, డేవిడ్ తదితరులు కూడా పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నట్లు తెలిపారు.


