కరీంనగర్‌లో మహిళా బ్లూ కోల్ట్స్ సేవలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మహిళా బ్లూ కోల్ట్స్ పోలీసుల సేవలను కమిషనర్ గౌష్ ఆలం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులకు ప్రభుత్వ స్కూటీలను అందజేసి, జెండా ఊపి విధుల్లోకి పంపించారు. బ్లూ కోల్ట్స్ బృందం బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డయల్ 100 కాల్స్ అటెండ్ చేయడం వంటి విధులు నిర్వర్తించనుందని తెలిపారు. మహిళా పోలీసుల భాగస్వామ్యం పెరగడం వల్ల శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని సీపీ అన్నారు. త్వరలోనే కమిషనరేట్ వ్యాప్తంగా మహిళా బ్లూ కోల్ట్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ప్రజలతో మరింత చేరువ కావడమే ఈ చర్య ప్రధాన ఉద్ధేశ్యమని ఆయన స్పష్టం చేశారు.


