*అశ్వ దళంలోకి మహిళా కానిస్టేబుళ్లు
*శిక్షణ పూర్తి చేసుకున్న పదిమంది
*హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక మహిళా గుర్రపు దళం సేవలు
*బందోబస్తు, వీఐపీల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగం
*ఇదోక చారిత్రాత్మాక నిర్ణయంగా నిలిచిపోతుంది
* హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్
*మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ప్రొత్సాహం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో మహిళా గుర్రపు దళాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం వెల్లడించారు. ఇదోక చారిత్రాత్మాక నిర్ణయంగా నిలిచిపోతుందని ఆయన అభివర్ణించారు. హార్స్ రైడింగ్‌లో పదిమంది సాయుధ రిజర్వ్ (AR) మహిళా కానిస్టేబుళ్లకు రెండు నెలల పాటు గోషామహల్ మౌంటెడ్ యూనిట్‌లో శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు. శిక్షణ పూర్తి కావడంతో శుక్రవారం పదిమందిని గుర్రపు పోలీసు దళంలో చేర్చినట్లు తెలిపారు.
ఈ మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తు, వీఐపీల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగించనున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, మహిళా మౌంటెడ్ పోలీసులు గస్తీలో మొదటిసారిగా పాల్గొనబోతున్నారని సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
డాగ్ స్క్వాడ్ విస్తరణ..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డాగ్ స్క్వాడ్‌ను కూడా విస్తరిస్తున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 34 శునకాలతో అధిక పనిభారం ఉన్నందున, ఆ సంఖ్యను 54కు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదనపు శునకాలను ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA)లో విస్తృత శిక్షణ పొందిన తర్వాత బృందంలో చేర్చుకుంటాము. బాంబులు, మాదక ద్రవ్యాలు, మరియు నేరస్తుల గుర్తింపు వంటి వాటిలో వీటిని వినియోగిస్తామని తెలిపారు.
శునకాల నాణ్యతను మెరుగుపరచడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న డాగ్ బ్రీడర్ల నుండి నాణ్యమైన శునకాలను ఎంపిక చేస్తోందని, మొదటి దశలో 12 శునకాలను సేకరించారు, భవిష్యత్తులో మరికొన్నిటిని తీసుకుంటాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షిత కృష్ణ మూర్తి ఐపిఎస్ డిసిపి కార్ హెడ్ క్వార్టర్స్, జి.చంద్ర మోహన్ ఐపిఎస్ డిసిపి సౌత్ వెస్ట్ జోన్ , ధార కవిత డీసీపీ సైబర్ క్రైమ్, గిరి బాబు అడిషినల్ డీసీపీ సీఏఎస్‌డబ్ల్యూ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


