కాకతీయ, హనుమకొండ : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి సాధ్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. భీమారం ఎం.టి.ఆర్ గార్డెన్స్‌లో గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలంటే దృఢసంకల్పం, అంకితభావంతో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆడపిల్లలు నిర్ణయించుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఆమె అన్నారు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలంటే విద్య, నైపుణ్య శిక్షణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి పథకం మహిళలకు లబ్ధి చేకూరేలా ప్రవేశపెడుతున్నట్లు డాక్టర్ కావ్య తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ధైర్యంగా ఏ సమస్యకైనా ఎదురొడ్డి నిలబడాలని సూచించారు. అలాగే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


