మహిళలే మహారాణులు
కోటి మంది మహిళలు కోటీశ్వరులే లక్ష్యం
మహిళల అభ్యున్నతికి రూ.40 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
మరో రెండేళ్లలో అదనంగా రూ.60 వేల కోట్లు
గత ప్రభుత్వ వైఫల్యంతో మహిళలకు ఆర్థికంగా నష్టం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
పాలకుర్తిలో ఇందిరా మహిళా శక్తి ఫంక్షన్ హాల్ ప్రారంభం
కాకతీయ, రాయపర్తి/ పాలకుర్తి : మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో మహారాణుల్లా వెలగాలన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆర్థిక శక్తిగా మహిళలు ఎదగాలి..!
అనంతరం మండల కేంద్రంలో ఆర్డీఓ పీడీ వసంతలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూ.47 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరా మహిళా శక్తి ఎస్‌ఎల్‌ఎన్ ఫంక్షన్ హాల్ భోజనశాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న సంకల్పంతో మహిళలకు రూ.40 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మరో రూ.60 వేల కోట్లు అందిస్తామని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ విధానమని ఆమె అన్నారు.
గత ప్రభుత్వ వైఫల్యంపై విమర్శ
గత ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.3,500 కోట్ల రుణాలను అందించకపోవడంతో మహిళలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆమె కొనియాడారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరునే మంజూరు చేస్తున్నామని, మేడారం జాతరలో వ్యాపారం నిర్వహించేందుకు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందించి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. మహిళల అభ్యున్నతికి పాలకుర్తిలో ఇందిరా మహిళా శక్తి ఎస్‌ఎల్‌ఎన్ ఫంక్షన్ హాల్ భోజనశాల ఏర్పాటు కావడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపిడీవో, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, మహిళా సంఘాల నేతలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


