పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం
వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారత
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
రూ.2.88 కోట్ల మెగా చెక్కు పంపిణీ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో అట్టహాసంగా నిర్వహించిన రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు చెందిన 864 పట్టణ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి మొత్తం రూ.2,88,35,377 విలువైన మెగా చెక్కును మహిళా ప్రతినిధులకు ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు పొదుపుతో పాటు చిన్నతరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గృహావసరాలకు కాకుండా ఆదాయ వనరులు పెంపొందించే పనులకు రుణాలను వినియోగించాలని హితవు పలికారు. పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని, పూర్తిస్థాయిలో రుణాల పంపిణీ ద్వారా మహిళలకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని కూనంనేని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరైన మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


