కనీస సౌకర్యాల్లేవ్..ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేస్తారా?
భక్తుల ఇబ్బందులను పట్టించుకోరా?
ఆర్జిత సేవా రుసుంను పెంచడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్‌లో ఆగ్రహం
కాకతీయ, జగిత్యాల : కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఆర్జిత సేవా రుసుములను భారీగా పెంచడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన బండి సంజయ్.భక్తులకు కనీస సౌకర్యాల్లేవు. ఆలయ ప్రాంగణంలో శుభ్రత లేకుండా, తాగునీరు, పార్కింగ్ సదుపాయాలు, షెల్టర్ వసతులు లేకుండా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆర్జిత సేవా రుసుములను అడ్డగోలుగా పెంచడం ఏమిటి? అని ప్రశ్నించారు.భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా, ఆర్థిక లాభాల కోసమే నిర్ణయాలు తీసుకోవడం తగదని హెచ్చరించారు.తక్షణమే పెంచిన ఆర్జిత సేవా రుసుములను వెనక్కి తీసుకోవడంతో పాటు, భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలన్నారు.కొండగట్టు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక గుండెచప్పుడు లాంటిది… ఇక్కడ భక్తులకు కష్టాలు కలగడం ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది అని బండి సంజయ్ స్పష్టం చేశారు.


