పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా
కాకతీయ, న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19, 2025న నిరవధికంగా వాయిదా పడ్డాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ సమావేశాలు 19 రోజుల పాటు కొనసాగాయి. కీలక బిల్లుల ఆమోదం, ప్రతిపక్షాల ఆందోళనలు, వాడీవేడి చర్చల మధ్య సమావేశాలు ముగిశాయి. గ్రామీణ ఉపాధికి కొత్త రూపమిచ్చే ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది ప్రస్తుతం అమలులో ఉన్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో అమలుకానుంది. అలాగే పౌర అణుశక్తి రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని అనుమతించే ‘శాంతి (SHANTI) బిల్లును’ ఉభయ సభలు ఆమోదించాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై సభల్లో తీవ్ర చర్చలు జరిగాయి. ప్రతిపక్షాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టాయి. అలాగే వందే మాతరం 150 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక చర్చ కూడా జరిగింది. చివరి రోజున లోక్‌సభలో వందే మాతరం ఆలపించిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలో చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభను ముగించారు.


