కరీంనగర్‌లో చలి జోరు స్వెటర్ల ధరలు ఉరకలు
ప్రజలు కొనుగోలుకు ఇబ్బంది
కాకతీయ, కరీంనగర్: జిల్లాలో చలిగాలులు ఊపిరి బిగపట్టిస్తున్నాయి. రాత్రిపూట, తెల్లవారుఝామున ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో వీధులకే చలి వణుకు వచ్చింది. ఈ పరిస్థితి నేపథ్యంలో మార్కెట్లలో వింటర్ వేర్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. అయితే చలి పెరిగినంతగా ధరలు కూడా ఎగబాకడం సామాన్యులకు కొత్త సమస్యగా మారింది.నగరంలోని తెలంగాణ చౌక్, మార్కెట్ ఏరియా, పలు పరిసరాల్లో తాత్కాలికంగా ఏర్పాటైన స్వెటర్ బజార్లు కిటకిటలాడుతున్నాయి. చిన్నారుల స్వెటర్లు గతేడాది ₹250–₹350 ఉంటే ఈసారి నేరుగా ₹450–₹600కు చేరాయి. పెద్దల కోసం సాధారణ నూలు స్వెటర్లు ₹700 దాటగా, బ్రాండెడ్ వింటర్ జాకెట్లు ₹1500 నుంచి ₹2500 వరకు పలుకుతున్నాయి. ధరలు ఇంత ఎక్కువగా ఉండటంతో మధ్య తరగతి, కూలీ వర్గాలకు కొనుగోలు భారంగా మారింది.రవాణా ఛార్జీల పెరుగుదల, ముందుగానే చలి ప్రారంభం కావడం వల్ల సరుకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని వ్యాపారులు చెప్పుకుంటున్నారు. అయితే వినియోగదారులు మాత్రం ఇది వ్యాపారుల అదనపు లాభాల ఆశ అని మండిపడుతున్నారు.చలి తప్పించుకోవడానికి పిల్లలకు, పెద్దలకు స్వెటర్ తప్పనిసరి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ధరలు పెంచేస్తున్నారు అని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.


