పంచుతారా… నొక్కేస్తారా..?
అభ్యర్థుల్లో అంతర్మథనం
తెరవెనుక ఓట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా పంపకాలు
డివిజన్ల వారీగా ప్రత్యేక ఇన్చార్జీలు
అనుచరులపై అనుమానంతో అబ్జర్వర్లు
డిజిటల్ వేదికలపై కొనసాగుతున్న ప్రచారం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. బహిరంగ సభలు, ర్యాలీల హోరు ముగియడంతో ఇప్పుడు సమరం పూర్తిగా ఇళ్ల ముంగిటకు మారింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో గెలుపు–ఓటముల భయం అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. ప్రచారం ముగిసిన వెంటనే జిల్లావ్యాప్తంగా ‘తాయిళాల పంపిణీ’ పర్వం వేగం అందుకుంది. డోర్ టు డోర్ ఆపరేషన్ పేరుతో అనుచరులను రంగంలోకి దింపిన అభ్యర్థులు, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ లెక్కలతో, పక్కా వ్యూహాలతో పంపకాలు సాగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పంపకాల కోసం ప్రత్యేక వ్యవస్థ
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అభ్యర్థులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో డివిజన్‌కు ప్రత్యేకంగా ఇన్చార్జీలను నియమించి, వారి ద్వారా మాత్రమే తాయిళాల పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. అయితే పంపకాలు జరుగుతున్నాయా? లేక మధ్యలోనే అనుచరులు నొక్కేస్తున్నారా? అన్న అనుమానాలు అభ్యర్థులను వెంటాడుతున్నాయి. దీంతో కొందరు అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా అబ్జర్వర్లను నియమించి, పంపకాల తీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తాయిళాలు అందుకున్న ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకుని, డివిజన్ ఇన్చార్జీలు స్వయంగా రీ-కాల్ చేసి నిర్ధారించుకుంటున్నారని సమాచారం. అయినా పూర్తిస్థాయిలో నమ్మకం కుదరక అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రమాణాలతో తాయిళాల పంపిణీ
గెలుపే లక్ష్యంగా అప్పులు చేసి బరిలోకి దిగిన కొందరు అభ్యర్థులు పంపకాల విషయంలో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటు ఖచ్చితంగా తమకే పడాలన్న ఉద్దేశంతో, కర్పూరం వెలిగించి అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేయిస్తూ తాయిళాలు అందజేస్తున్నారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. కొన్ని డివిజన్లలో డబ్బు పంపిణీ మరింత పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఒక్కో ఓటుకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఇస్తుండగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. డివిజన్ బట్టి, పోటీ తీవ్రత బట్టి ఈ లెక్కలు మారుతున్నాయని తెలుస్తోంది.
ఆగని డిజిటల్ ప్రచారం
ప్రచార గడువు ముగిసినప్పటికీ అభ్యర్థులు డిజిటల్ వేదికలపై మాత్రం వేగం తగ్గించలేదు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఒక్కో డివిజన్‌కు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి, నిరంతరం మెసేజ్‌లు, వీడియోలు, ఆడియో కాల్స్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పట్టణాలకు దూరంగా ఉన్న ఓటర్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఫోన్ కాల్స్ ద్వారా నేరుగా సంప్రదిస్తూ, “నీ ఓటు ఎంతో కీలకం… రాగానే ఫోన్ చేయి” అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
పక్కా లెక్కలతో వ్యూహాలు
ఓటర్లను ఆకట్టుకునే విషయంలో అన్ని పార్టీలు పక్కా లెక్కలతో ముందుకు సాగుతున్నాయి. డివిజన్లో ఎంతమంది ఓటర్లు, గెలుపుకు అవసరమైన ఓట్ల సంఖ్య, ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు అన్న పూర్తి సమాచారంతోనే పంపకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు కొత్త ఓటర్లు తమకు తాయిళాలు అందలేదని నేరుగా అభ్యర్థులకే ఫోన్ చేసి నిలదీస్తున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. “పక్కవాళ్లకు ఇచ్చారు… మాకెందుకు ఇవ్వరు?” అంటూ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇన్ని వ్యూహాలు, ఎత్తుగడల మధ్య పోలింగ్‌కు కేవలం కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి నిమిషాల్లో ఎవరి లెక్కలు పండుతాయో, ఎవరి వ్యూహాలు బోల్తా పడతాయో అన్నది పోలింగ్ ఫలితాలే తేల్చనున్నాయి.


