మేడారం జాతరకు మచ్చ పడేనా..?
జంపన్న వాగు లెవలింగ్ పనులపై అనుమానాలు
జాతరకు ముందే వాగులో ప్రమాద ఘంటికలు
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా?.. భక్తుల భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026ను ఈ నెల 28 నుంచి 31 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల నిధులతో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్న వేళ, జంపన్న వాగులో జరిగిన ఓ ఘటన జాతర ఏర్పాట్లపై అనుమానాలకు తావిస్తోంది. భక్తుల సౌకర్యం కోసం చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పైపై పనులే ప్రమాదాలకు దారితీస్తున్నాయా? అన్న ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. జాతర ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ ఘటన కలకలం రేపుతోంది.
జంపన్న వాగులో పుణ్యస్నానమే ప్రమాదంగా
మేడారం జాతరలో భాగంగా భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ. ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం, జంపన్న వాగు పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేసింది. ప్రమాదాలు జరగకుండా వాగులో ఎత్తు–లోతులను సరిచేసి ఇసుకను చదును చేయాలని అధికార యంత్రాంగం పనులు చేపట్టింది. అయితే జాతర ఇంకా ప్రారంభం కాకముందే, పూర్తిస్థాయి నీటి విడుదల జరగకముందే శుక్రవారం జంపన్న వాగు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో ముగ్గురు భక్తులు అకస్మాత్తుగా లోతైన నీటిలో మునిగిపోతుండగా, అక్కడే అప్రమత్తంగా ఉన్న 5వ బెటాలియన్ ఎస్‌డీఆర్ఎఫ్ బృందం, ములుగు జిల్లా పోలీస్ సిబ్బంది సాహసోపేతంగా వారిని రక్షించారు. ఈ ఘటనలో భూపాలపల్లి ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తితో పాటు 14, 13 ఏళ్ల ఇద్దరు బాలికలు మునిగిపోతుండగా, కొద్ది క్షణాల తేడాతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
లెవలింగ్ పనుల నాణ్యతపై సందేహాలు
ఈ ఘటనతో జంపన్న వాగులో చేపట్టిన లెవలింగ్ పనుల నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన పనుల్లో లోతైన ప్రాంతాలు ఎలా మిగిలాయి? చదును చేశామని చెప్పినా పైపై పనులు చేసి వదిలేశారా? పూర్తిస్థాయి నీటి విడుదల కాకముందే ఇంత లోతు ఉంటే, జాతర రోజుల్లో పరిస్థితి ఏంటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మునిగిపోయిన వారు చిన్నపిల్లలు కాకపోయినా ప్రమాదానికి గురికావడం లోతు తీవ్రతను స్పష్టం చేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. కొందరు భక్తులు, స్థానికులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. పేపర్లపై పనులు పూర్తయ్యాయని చూపించి, వాస్తవంగా వాగు అడుగున ప్రమాదకరమైన లోతులు అలాగే వదిలేశారని వాపోతున్నారు.
భక్తుల భద్రతకే ప్రాధాన్యతా?
భక్తుల ప్రాణ భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, కొంతమంది కాంట్రాక్టర్లు చేతివాటం చూపితే ఆ నిధుల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జాతర ప్రారంభమయ్యేలోపు జంపన్న వాగులో లెవలింగ్ పనులపై సమగ్ర తనిఖీ చేపట్టి, లోతైన ప్రాంతాలను గుర్తించి అవసరమైతే పునఃపనులు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. జాతర ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్న వేళ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా స్పందిస్తుందా? లేక మరో ప్రమాదం తర్వాతే చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.


