కామారెడ్డి డిక్లరేషన్‌కు కార్యరూపం ఎప్పుడూ..?
బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్న
ప్రతి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఎక్కడ..?
బీసీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్
జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి ముదిరాజ్
కాకతీయ, గజ్వేల్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి ముదిరాజ్ ప్రశ్నించారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతి బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల సంక్షేమం, సాధికారతను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అమలు చేస్తున్న పథకాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న బీసీ కళాశాలలు, గురుకులాలకు సరైన నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బడుగు వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం బీసీ కార్పొరేషన్లకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ విద్యార్థులు, చేతివృత్తులు, కులవృత్తులకు ప్రోత్సాహం కల్పిస్తూ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీలకు న్యాయం చేయకపోతే జాగృతి ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు.


