- కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పార్టీ శ్రేణుల ఒత్తిడి
- బాస సత్యనారాయణ ఇంట్లో కీలక భేటీ
- రేపో ఎల్లుండో తుది నిర్ణయం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జిల్లాలో రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నవంబర్ 1న పోలింగ్ జరిగే ఈ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ప్యానెల్‌ను బరిలోకి దింపేందుకు సన్నద్ధమవుతుండగా, బీజేపీ కూడా పోటీ చేయాలన్న డిమాండ్ పార్టీ వర్గాల్లో ఊపందుకుంటోంది. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై కార్యకర్తలు, జిల్లా నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ఇదే బ్యాంక్ డైరెక్టర్ పదవితో మొదలైంది. రిజర్వ్ బ్యాంక్ చర్యల నేపథ్యంలో బ్యాంకును మూసివేయకుండా డైరెక్టర్ బండి సంజయ్, ఛైర్మన్ డి.శంకర్ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న 9,600 మంది ఓటర్లలో ఎక్కువశాతం సంజయ్ వైపే ఉన్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బ్యాంక్‌ను అవినీతి నుంచి రక్షించాలంటే బీజేపీ ప్యానెల్ అవసరమంటూ ఓటర్లు స్వయంగా ఫోన్ చేసి నేతల్ని కోరుతున్నట్లు సమాచారం.
కీలక నేతల భేటీ
ఈ పరిస్థితుల్లో బీజేపీ నుంచి ప్యానెల్‌ను బరిలోకి దించాలనే అంశంపై జిల్లా బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ నివాసంలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి. శంకర్, వాసాల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, కోమల ఆంజనేయులు, కన్నె కృష్ణ తదితరులు హాజరయ్యారు. పార్టీ తరఫున ఇండిపెండెంట్ ప్యానెల్‌ను బరిలోకి దింపితేనే విజయం సాధ్యమవుతుందని మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. బండి సంజయ్‌కు బ్యాంక్ ఓటర్లలో ఉన్న గుర్తింపు గెలుపుకు కీలకంగా మారుతుందని వారు అశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.
రేపో, ఎల్లుండో తుది నిర్ణయం
బీజేపీ తరఫున ప్యానెల్ బరిలోకి దిగాలా? అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయంపై రేపో లేక ఎల్లుండో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు, ఓటర్ల స్పందనను పరిశీలిస్తున్న బండి సంజయ్ సరైన సమయంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ ప్యానెల్ బరిలోకి దిగితే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశముంది.


