డీజీపీ ఎదుట బర్సే దేవా సరెండర్?
మరోసారి మావోయిస్టులకు భారీ షాక్
పీఎల్‌జీఏ చీఫ్‌గా ఉన్న బర్సే దేవా
రేపు మీడియాకు చూపనున్న పోలీసులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత బర్సే దేవా శుక్రవారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది కూడా సరెండర్ అయ్యారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో దేవా బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం హైదరాబాద్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై డీజీపీ శివధర్‌రెడ్డి శనివారం మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) చీఫ్‌గా ఉన్న బర్సే దేవా, ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా తర్వాత పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సాయుధ బలగాల కార్యకలాపాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థను ఆయన పర్యవేక్షించేవారని సమాచారం. హిడ్మా, దేవా ఇద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందినవారే కావడం గమనార్హం.
ఆపరేషన్ కగార్‌తో ఉక్కిరిబిక్కిరి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు పార్టీ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉంది. వందల మంది మావోయిస్టులు మృతి చెందగా, అనేక మంది జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే సెంట్రల్ కమిటీ మెంబర్లు హిడ్మా, గణేశ్ ఎన్‌కౌంటర్లలో మరణించగా, తాజాగా బర్సే దేవా లొంగుబాటు మావోయిస్టు పార్టీలో కుదుపు రేపింది. ఇక ఉద్యమాన్ని కొనసాగించడం సాధ్యం కాదన్న అభిప్రాయంలో నేతలు ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు వెన్నెముకగా నిలిచిన పీఎల్‌జీఏ కార్యకలాపాలు దాదాపు ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిడ్మా మృతితో బలహీనమైన పీఎల్‌జీఏ, ఇప్పుడు దేవా లొంగుబాటుతో పూర్తిగా నిర్వీర్యమైనట్లేనని భావిస్తున్నారు. ఒకప్పుడు 8 బెటాలియన్లు, 13 ప్లటూన్లతో 10–12 వేల మంది సాయుధ బలగాలతో భారీ ఆపరేషన్లు నిర్వహించిన పీఎల్‌జీఏ, కాలక్రమేణా అస్తిత్వాన్ని కోల్పోయింది. చివరిగా హిడ్మా నేతృత్వంలోని తొలి బెటాలియన్ మాత్రమే క్రియాశీలకంగా ఉండగా, ఇప్పుడు అది కూడా ముగింపు దశకు చేరినట్లుగా తెలుస్తోంది. బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి చరిత్రలోనే అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్న అభిప్రాయం భద్రతా వర్గాల్లో వ్యక్తమవుతోంది.


