కాకతీయ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధం కారణం భర్తను తొలగించాలనే పథకం వేసి, తన ప్రియుడితో కలిసి హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాధితుడు ప్రసాద్, గడ్డిగూడెం తండాలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అయితే అతని భార్య కొంతకాలంగా అనిల్ అనే వ్యక్తితో వివాహేతర కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం భర్తకు తెలిసిపోతుందనే భయంతో భార్య, ప్రియుడు కలసి అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదే క్రమంలో ఇటీవల ప్రసాద్‌పై వీరిద్దరూ దాడికి పాల్పడ్డారు. భార్య, ప్రియుడు కలిసి అతనిపై దాడి చేసి, చెవులు కోసినట్టు సమాచారం. తీవ్ర రక్తస్రావంతో ప్రాణభయానికి గురైన ప్రసాద్ అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. గ్రామస్తులు ప్రియుడు అనిల్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. తరువాత బాధితుడు ప్రసాద్ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. భార్య, ప్రియుడు తనపై పథకం ప్రకారం దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని వివరించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుండగా, ప్రియుడు అనిల్ చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన గడ్డిగూడెం తండాలో కలకలం రేపింది.


