మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు..?!
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ నోటీసులు
గడువులోగా వివరణ ఇవ్వాలని ఐదుగురికి జారీ..త్వరలోనే మిగతా వారికి జారీ
స్పీకర్ చర్యలపై ముందే చెప్పిన కాకతీయ
అక్షర సత్యమైన పొలిటికల్ కథనం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల్లో శుక్రవారం ఐదుగురికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. మిగతా ఐదుగురికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి మారారు…? పార్టీ మారడం ఫిరాయింపుల కింద వస్తుంది కదా..! మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని కోరుతూ నోటీసుల్లో స్పీకర్ పేర్కొనడం జరిగినట్లు సమాచారం. గడువులోగా ఈ విషయంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
నేను పార్టీ మారలేదు..! బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణ
బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కూడా స్పీకర్ నోటీసులు జారీ చేయగా… తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, పార్టీ మారలేదని ఫోన్‌లో వివరణ ఇచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇస్తానని చెప్పారు. తనకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని, స్పీకర్ ను కలసి వివరణ ఇస్తానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అదే విషయాన్ని స్పీకర్‌కు రాత పూర్వకంగా వివరిస్తానని తెలిపారు.
ముందే చెప్పిన కాకతీయ..! అక్షర సత్యమైన కథనం..
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన విషయాన్ని కాకతీయ శుక్రవారంఉదయం వెబ్సైట్‌లో కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. కాకతీయ కథనం అక్షర సత్యమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం స్పీకర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న విషయాన్ని కథనంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీచేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారు..? స్పీకర్‌కు ఎలాంటి సమాధానంతెలియజేస్తారు.? కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ అధినాయకత్వలా వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


