‘చెప్పుల దొంగ’కు ఎందుకు ఓట్లేయాలి?
బజార్ల అప్పు కూడా పుట్టని సీఎంను నమ్ముకుంటే లాభమేమిటి?
బీఆర్ఎస్ పాలనలో కబ్జాలు, దోపిడీలే మిగిలాయి
కేంద్రం నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి
బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని, అటువంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా ప్రశ్నించారు. “బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తి నగరాలను ఎలా అభివృద్ధి చేస్తారు? చెప్పుల దొంగలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలి?” అంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని దుర్షేడ్, గోపాల్పూర్, సప్తగిరి కాలనీ, ఉస్మానీ అసోసియేట్స్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున బండి సంజయ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. 4, 5, 44, 45, 13వ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు భూపతి రవీందర్, చిందెం హారిక, బండి తార, గడప విజయలక్ష్మి, రెడ్డవేణ లావణ్యలను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీధి సభల్లో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తనపై నమ్మకం లేదని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. “నాకు బజార్ల అప్పు కూడా పుట్టడం లేదు, ఢిల్లీలో చెప్పులెత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు అని రేవంత్ రెడ్డే అన్నారు. మరి అలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలి?” అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు..!
బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, పదేళ్లుగా కబ్జాలు, దోపిడీలే జరిగాయని బండి సంజయ్ మండిపడ్డారు. “మళ్లీ ఆ పార్టీలను గెలిపిస్తే కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి దోచుకోకుండా ఉంటారా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడదా?” అని ప్రజలను ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వస్తే ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు నిలదీయాలని, బీఆర్ఎస్ నాయకులు వస్తే గత పదేళ్ల పాలనపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరిగిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నగరానికి రూ.1,500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మోదీని గుర్తుపడతారా? వాళ్లు అడిగితే మోదీ నిధులు ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. “కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసింది బీజేపీయే” అని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు ఇటీవలే కేంద్రం రూ.50 కోట్లు మంజూరు చేసిందని, ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.134 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇంటి పన్నులు, నల్లా ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచడం ఖాయమని హెచ్చరించారు. బీజేపీకి ఓటేస్తే మాత్రం ఎలాంటి పన్నులు పెంచకుండా కేంద్ర నిధులతోనే నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర నిధులు దారి మళ్లి అభివృద్ధి నిలిచిపోతుందని హెచ్చరించారు. బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే కరీంనగర్‌కు వరదలా నిధులు తీసుకొచ్చే బాధ్యత తానే తీసుకుంటానని బండి సంజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు.


