జైస్వాల్‌కు ఛాన్స్ ఎందుకు ఇవ్వరు
మూడు ఫార్మాట్లలో సత్తా చాటినా ‘వన్ ఫార్మాట్ ప్లేయర్’ ముద్ర
టెస్టుల పేరుతో వైట్‌బాల్‌కు దూరం.. సెలెక్టర్ల తీరు గందరగోళం
వందల రన్స్ చేస్తున్నా బెంచ్‌కే పరిమితమా..?!
‘డ్రాప్ చేయాల్సిన అవసరమే లేదు’ : వెంగ్‌సర్కార్ ఘాటు వ్యాఖ్యలు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు.. కానీ ప్రతిభకు న్యాయం జరుగుతోందా అంటే సమాధానం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటిన ఆటగాడిగా గుర్తింపు పొందినా, కీలక వైట్‌బాల్ సిరీస్‌లు, టోర్నీల్లో అతడికి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2024 జూలైలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ తర్వాత జైస్వాల్‌ను టెస్టులపై దృష్టి పెట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్ సూచించింది. ఆరు నెలల పాటు టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే అదే సమయంలో ఇతర ఆటగాళ్లు వైట్‌బాల్ సిరీస్‌ల్లో కొనసాగుతూ సెలెక్టర్ల దృష్టిలో నిలిచారు. ఫలితంగా జైస్వాల్ మాత్రం ‘కనిపించని’ ఆటగాడిగా మారాడు.
రన్స్ చేస్తున్నా అవకాశాలివ్వరా..!?
టీ20ల్లో చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 93, 12, 40, 30, 10 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ దాదాపు 200కి చేరువగా ఉంది. దేశవాళీ క్రికెట్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సౌతాఫ్రికాతో ఆడిన చివరి వన్డేలో సెంచరీ చేసినా, జనవరి 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో మాత్రం అతడికి చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. కారణం – రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రీ ఎంట్రీ. ఒకవైపు శుభ్‌మన్ గిల్‌ను టీ20ల నుంచి తప్పించారు. మరోవైపు రెండో వికెట్‌కీపర్ ఓపెనర్ కావాలంటూ ఇషాన్ కిషన్‌ను తీసుకున్నారు. అదే సమయంలో జైస్వాల్ చేసిన సెంచరీలు, స్థిరమైన ఫామ్‌ను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది.
నిరంతరం అవకాశాలు లేకపోవడం యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాజీ ఓపెనర్ డబ్ల్యూ.వి.రామన్ కూడా సెలెక్టర్లు జైస్వాల్‌తో స్పష్టంగా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు. 24 ఏళ్ల వయసులో ఇంకా ముందుకు వెళ్లాల్సిన దశలో ఉన్న జైస్వాల్‌కు ఈ గందరగోళం ఎంతవరకు ఉపయోగపడుతుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రతిభ, ఫామ్, ప్రభావం – ఇవే సెలెక్షన్ ప్రమాణాలైతే.. జైస్వాల్‌కు న్యాయం జరగాల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.
వెంగ్‌సర్కార్ ఫైర్
జైస్వాల్‌ను మళ్లీ మళ్లీ తప్పించడం దురదృష్టకరం. అతడు మ్యాచ్ విన్నర్. అలాంటి ఆటగాడిని బెంచ్‌పై పెట్టకూడదు” అని అన్నారు. గిల్‌ను తప్పించడాన్ని సమర్థించినప్పటికీ, అతడి స్థానంలో తన ఎంపిక మాత్రం జైస్వాలేనని తేల్చేశారు.


