మార్కెట్ లైసెన్స్ జారీకి ఆలస్యం ఎందుకు..?
రైతుల పంట కొనుగోలుపై అనిశ్చితి….
మార్కెట్ విధానాలపై ఆందోళన…
చివరికి నష్టపోయేది రైతులే….
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో రైతులు వరి కోతలతో బిజీగా ఉండగా, రైస్ మిల్లర్లకు మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యం కావడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. రైతులు, వ్యాపారులు సమన్వయంగా పని చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైన వ్యవసాయ మార్కెట్ కార్యాలయాలు ఇప్పుడు వ్యవసాయదారులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
ధాన్యం కొనుగోలుకు కొత్త నిబంధనలు…..
ప్రతి సంవత్సరం కోతల అనంతరం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తుంది. అనంతరం రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట కొనుగోలు మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రభుత్వం రైస్ మిల్లర్లకు మార్కెట్ లైసెన్స్ తప్పనిసరి చేసింది. జిల్లా మార్కెట్ కార్యాలయం నుండి లైసెన్స్ పొంది, దానిని ఓపీఎంఎస్ (OPMS) పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే రైతుల పంట కొనుగోలు మొత్తం ప్రభుత్వం జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
దరఖాస్తులు పెండింగులోనే…
ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తీసుకు వచ్చిన నిబంధనల మేరకు జిల్లాలోని అనేక రైస్ మిల్ యజమానులు నెల రోజుల క్రితమే మార్కెట్ లైసెన్స్ కోసం దరఖాస్తులు సమర్పించారు. అయితే ఇప్పటికీ ఆ దరఖాస్తులపై ఎటువంటి స్పందన లేకపోవడం, ఆమోదం తెలపకపోవడం, లేదా లోపాలు ఉన్నట్లయితే అవి తెలియజేయకపోవడం రైస్ మిల్లర్లలో అసంతృప్తి కలిగిస్తోంది. పలుమార్లు మార్కెట్ కార్యాలయాన్ని సంప్రదించినా త్వరలో ఇస్తాం లేదా లైసెన్స్ ఇవ్వడం కుదరదు అనిలా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో రైతులు, మిల్లర్లు ఇద్దరూ అసహనానికి గురవుతున్నారు.
మార్కెట్ లైసెన్స్ లేక రైతులకు డబ్బులు రాకపోవచ్చు..
ప్రస్తుతం మార్కెట్ లైసెన్స్ ఉన్న రైస్ మిల్లులకు మాత్రమే ప్రభుత్వం ధాన్యం పంపే అవకాశం ఉంది. లైసెన్స్ లేని మిల్లులకు ధాన్యం పంపితే, ప్రభుత్వ చెల్లింపులు రాకపోవడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాని ప్రమాదం ఉంది. దీంతో లైసెన్స్ జారీ ఆలస్యం రైతుల పంట కొనుగోలుపై నేరుగా ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. ములుగు జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా, రైస్ మిల్లుల లైసెన్స్ సమస్య వల్ల కొనుగోలు ప్రక్రియ మందగిస్తోంది.
చివరకు రైతులే నష్టపోతారు…..
రైతులు తమ శ్రమతో పండించిన పంటను అమ్మి వెంటనే డబ్బు పొందాలనుకుంటున్నారు. కానీ మార్కెట్ లైసెన్స్ లేనందువల్ల ధాన్యం నిల్వలు పెరగడం, చెల్లింపులు ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు అని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సదుపాయాలు కల్పించినా, మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ములుగు జిల్లా వ్యవసాయ మేధావులు పేర్కొన్నారు. మార్కెట్ లైసెన్స్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి, తగిన అర్హత ఉన్న రైస్ మిల్లులకు తక్షణమే లైసెన్స్‌లు మంజూరు చేయాలని, లైసెన్స్‌లో లోపాలు ఉన్నట్లయితే స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే రైతులు పంట అమ్మకానికి అవకాశాలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రైతులు తమ పంటకు గాను చెల్లింపులు సకాలంలో పొందలేని పరిస్థితి తలెత్తి, ఖరీఫ్ సీజన్ మొత్తం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని వ్యవసాయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.



