కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు?
ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలి
వెన్నెల నగర్‌లో నీటి కరెంటు సమస్యలు తీవ్రం
సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనలు పెరుగుతాయి
సేవ్ కార్పొరేషన్ సేవ్ కొత్తగూడెం కన్వీనర్ పట్టణ కార్యదర్శి మహమ్మద్ జలాల్
కాకతీయ,కొత్తగూడెం : కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు, ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలని వెన్నెల నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి, కరెంటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహమ్మద్ జలాల్ స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వెన్నెల నగర్ వాసులు ధర్నా చేపట్టారు. సుమారు 1000 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో నీరు, విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నూతన పాలకవర్గం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ జలాల్ మాట్లాడుతూ స్థలాలు ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గత పాలకవర్గం సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన రాలేదన్నారు.
బోర్లు వేసినా ఉపయోగం లేకపోవడం
3 నెలల క్రితం బోర్లు వేసినా కరెంటు కలెక్షన్ ఇవ్వకపోవడంతో అవి పనిచేయడం లేదన్నారు. దీంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇది అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శించారు. నూతన పాలకవర్గం వెన్నెల నగర్‌కు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. సమస్యలపై వినతి పత్రాన్ని మేయర్ మూడ్ గణేష్‌కు అందజేశారు. మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిధులపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెన్నెల నగర్ వాసులు, నాయకులు పాల్గొన్నారు.


