- కరీంనగర్ వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ
- రాజకీయ వర్గాల్లోనూ నెలకొన్న ఆసక్తి
- సభ్యుల మద్దతు ఎవరికి దక్కింది.. మరి కొద్ది గంటల్లో తేలనున్న ఫలితం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ఫలితం మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. మూడు బలమైన ప్యానల్స్ పోటీలో ఉన్నాయి. మొత్తం 9,287 మంది ఓటర్లలో 7,272 మంది కరీంనగర్ పరిధిలో, 2,015 మంది జగిత్యాల పరిధిలో ఉండగా ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా కనిపించింది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాల వద్ద సభ్యులు బారులు తీరారు. మహిళా డిగ్రీ కళాశాల (కరీంనగర్), మహిళా జూనియర్ కళాశాల (జగిత్యాల)లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు. గతానికి భిన్నంగా ఈ సారి బ్యాంకు ఎన్నికలపై తీవ్ర ఉత్కంట నెలకొంది. రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 31 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో 24, జగిత్యాలలో 7 బూత్‌లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి బూత్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కఠిన పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహించారు. అధికారులు, ఎలక్షన్ ఆబ్జర్వర్లు, బ్యాంక్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేశారు.


