జాతరలో పవర్ కట్కు ఎవరు బాధ్యులు?
కొత్త కాంట్రాక్టర్ ప్రయోగమే శాపమా?
రాష్ట్రస్థాయి జోక్యమే కొంపముంచిందా?
తీరా ఇప్పుడు కిందిస్థాయి అధికారులను బలి చేయాలని చూస్తున్నారా..?
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా, తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో ఈసారి విద్యుత్ శాఖ తీవ్ర విమర్శల పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ, అత్యంత కీలకమైన విద్యుత్ సరఫరాలో మాత్రం ఘోర వైఫల్యం చోటుచేసుకుందని భక్తులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఏర్పాట్లు చేశామని జాతర ముందస్తు ప్రచారంలో ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు, జాతర జరుగుతున్న సమయంలోనే పలుమార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో విమర్శల పాలయ్యారు. ఈ పవర్ కట్ ఘటనలు ఇప్పుడు అధికార వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి.
రాత్రివేళల్లోనే కరెంటు కట్… భక్తుల్లో భయం
జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటివరకు నిర్వహించిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో రాత్రి వేళల్లో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో క్యూలైన్ల వద్ద గందరగోళం నెలకొనగా, కొన్ని చోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. భక్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటన, దొంగతనాల ఆరోపణలు, గుడారాల ప్రాంతాల్లో గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి పరిణామాలు విద్యుత్ వైఫల్యానికి నిదర్శనాలుగా మారాయి. తాత్కాలికంగా జనరేటర్లను వినియోగించినా, డీజిల్ అయిపోతుందన్న భయంతో అధికారులు ఆందోళనకు గురయ్యారని సమాచారం. చివరి నిమిషంలో విద్యుత్ పునరుద్ధరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి మేడారం జాతరలో తీసుకున్న కాంట్రాక్టర్ నిర్ణయమే పవర్ కట్లకు ప్రధాన కారణమన్న అభిప్రాయం విద్యుత్ శాఖలోనే వినిపిస్తోంది. గతంలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లతో పనులు చేయించడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, ఈసారి వారిని పక్కనపెట్టి కొత్త కాంట్రాక్టర్‌కు కీలక పనులు అప్పగించడమే సమస్యలకు మూలమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారి సిఫారసుతో హైదరాబాద్‌కు చెందిన కొత్త కాంట్రాక్టర్‌కు దాదాపు కోటి రూపాయలకు పైగా విలువైన పనులు అప్పగించినట్టు సమాచారం. అనుభవం లేని కాంట్రాక్టర్, మేడారం భౌగోళిక పరిస్థితులు, లక్షలాది భక్తుల రద్దీని అంచనా వేయడంలో విఫలమవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కిందిస్థాయి అధికారులే బలిపశువులా?
పవర్ కట్ ఘటనలపై కిందిస్థాయి అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే అసలు కారణం పై స్థాయి నిర్ణయాలే అయినప్పటికీ, బాధ్యతను జిల్లాస్థాయి అధికారులపై నెట్టివేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పై స్థాయి జోక్యంతో ఏర్పడిన సమస్యలకు కిందిస్థాయి సిబ్బందిని బలిపశువులుగా చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోటికి పైగా భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరలో విద్యుత్ అంతరాయం అంటే కేవలం అసౌకర్యం కాదు… అది భక్తుల భద్రతకు ముప్పు. అనుభవాన్ని పక్కనపెట్టి ప్రయోగాల పేరుతో తీసుకున్న నిర్ణయాలు భక్తుల ప్రాణాలతో చెలగాటమాడినట్టేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి నిజంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందా? లేక చర్యలు కిందిస్థాయి అధికారులకే పరిమితం అవుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.


