కమలానికి కొత్త కెప్టెన్ ఎవరు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై ఉత్కంఠ!
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్
నేటి నుంచే నామినేషన్లు ప్రారంభం
టాప్ పోస్ట్ కోసం పోటీ పడుతున్న కేంద్ర మంత్రులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు పార్టీ అధికారికంగా కదలికలు మొదలుపెట్టింది. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక పదవిపై ఇప్పుడు ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2023లోనే ముగిసినప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. ఇప్పుడు ఆ పొడిగింపు కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పూర్తి దృష్టి పెట్టింది.
బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచే ఆశావహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ నెల 14న బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష పదవితో పాటు జాతీయ కార్యవర్గ సభ్యుల ఎంపిక కూడా ఇదే ప్రక్రియలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
బీజేపీలో జాతీయ అధ్యక్ష ఎన్నికలు సాధారణంగా ఏకగ్రీవంగా జరగడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. అయితే ఒకటి కంటే ఎక్కువ మంది బరిలో ఉంటే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అలా జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ కౌన్సిల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈసారి కూడా సంప్రదాయమే కొనసాగుతుందా? లేక అనూహ్యంగా పోటీ కనిపిస్తుందా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
రేసులో ఎవరు?
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఈసారి భారీగానే ఆశావహులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు బలంగా వినిపిస్తోంది. జాతీయ స్థాయి రాజకీయాలపై ఆయనకు ఉన్న పట్టు, కేంద్ర మంత్రిగా అనుభవం, పలు రాష్ట్రాల్లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారన్న అంశాలు ఆయనకు బలంగా మారుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ వంటి సీనియర్ నేతల పేర్లు కూడా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీలో జాతీయ అధ్యక్షుడి ఎంపికలో పార్టీ అగ్రనాయకత్వం పాత్ర కీలకమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్న నేతకే అధ్యక్ష పీఠం దక్కుతుందన్నది ఓపెన్ సీక్రెట్. ఈసారి కూడా అదే రిపీట్ కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కమలానికి కొత్త కెప్టెన్ ఎవరు అన్న సస్పెన్స్ కు త్వరలోనే తెర పడబోతుంది. మరి ఆ ఎంపిక బీజేపీ భవిష్యత్ రాజకీయ దిశను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.


