పుతిన్ ఢిల్లీ యాత్రతో వైట్‌హౌస్ షాక్… ట్రంప్ నెక్స్ట్ మూవ్ ఏంటి?
పుతిన్ భారత పర్యటనతో కదిలిన గ్లోబల్ పవర్ బ్యాలెన్స్
పాశ్చాత్య ఒత్తిడులను పక్కన పెట్టిన మోదీ–పుతిన్ దూకుడు
ఇండియా–రష్యా కొత్త ఒప్పందాలు వైట్‌హౌస్‌కు వార్నింగ్ సిగ్నల్
కాకతీయ, ఇంటర్నేషనల్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజా భారత్ పర్యటన ప్రపంచ రాజకీయాల్లో భారీ చర్చకు కారణమైంది. ముఖ్యంగా అమెరికా వైట్‌హౌస్‌లోనూ, ట్రంప్ వర్గాల్లోనూ దీనికి సంబంధించి అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా వరుస ఆంక్షలు, టారిఫ్ బెదిరింపులు, ఒత్తిళ్ల మధ్యే పుతిన్ ఢిల్లీలోకి అడుగుపెట్టడం గ్లోబల్ పవర్ బాలెన్స్‌ను పూర్తిగా మార్చేసింది.
భారత్–రష్యా సంబంధాలు పుతిన్ పర్యటనతో మరింత బలపడాయి. రక్షణ నుంచి ఇంధనం వరకు, అణుశక్తి నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు పలు కీలక రంగాల్లో ఇరు దేశాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా 2030 వరకూ ఆర్థిక రోడ్‌మ్యాప్ ప్రకటించడం, 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక ట్రేడ్ లక్ష్యం పెట్టడం వైట్‌హౌస్ లెక్కలను పూర్తిగా తారుమారు చేసింది.
అమెరికా యూరప్ దేశాలు గత కొంతకాలంగా భారత–రష్యా వాణిజ్యం తగ్గించాలని తీవ్ర ఒత్తిడి చేస్తుంటే… ఇందుకు పూర్తి విరుద్ధంగా భారత్–రష్యా మరింత దగ్గరవడం పాశ్చాత్య దేశాలకు అసహనాన్ని కలిగించే అంశం. వైట్ హౌస్ దీనిపై పెద్దగా స్పందించకపోయినా, అక్కడి స్ట్రాటజిక్ వర్గాలు ఇది వార్నింగ్ సిగ్నల్ గా చూస్తున్నాయి. పుతిన్-మోదీ మీటింగ్‌ను ట్రంప్ క్యాంప్ మాత్రం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అమెరికా ఒత్తిడులను పక్కన పెట్టి భారత్ రష్యాకు ఇచ్చిన ప్రాధాన్యం, ఆసియా–యూరేషియా భూభౌగోళిక సమీకరణాలలో భారత్ పెంచుకుంటున్న ప్రభావం ట్రంప్‌కు అసలు నచ్చకపోయే అవకాశం ఉంది. అమెరికా–ఇండియా సంబంధాల్లో ఇది చిన్న షాక్ లాంటిదే.
అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద ప్రశ్న.. ట్రంప్ నెక్స్ట్ మూవ్ ఏంటి? అనేదే. విశ్లేషకుల అంచనా ప్రకారం, అమెరికా భారత్‌పై టారిఫ్ ప్రెజర్ పెంచే అవకాశాలున్నాయి. కొన్ని డిఫెన్స్ ఒప్పందాలను రివ్యూ చేసే ఛాన్స్ కూడా ఉంది. పాశ్చాత్య దేశాలను కలుపుకుని భారత్‌పై ఇండైరెక్ట్ డిప్లమాటిక్ ప్రెజర్ పెంచడం కూడా ట్రంప్ పరిశీలించే దిశల్లో ఒకటి. ఇక కొంతమంది అనలిస్టుల అభిప్రాయం వేరుగా ఉంది. భారత్‌ను పూర్తిగా దూరంగా నెట్టుకోవడం అమెరికాకు లాంగ్ టర్మ్ నష్టం. కాబట్టి ఒత్తిడి పెంచే బదులు ట్రంప్ కొత్త ఆఫర్లతో, కొత్త డీల్స్‌తో భారత్‌ను ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు.


